Search Any Movies Links for Download Here
Perfectmatch.com

Tuesday, March 24, 2009

కాంతారావు మృతికి ప్రముఖుల నివాళి

Kantharao dedbody
జానపద హీరోగా అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన కత్తుల కాంతారావుకు సినీ పరిశ్రమ సోమవారం ఘనంగా నివాళలర్పించింది. యశోదా ఆస్పత్రిలో మృతిచెందిన కాంతారావు భౌతిక కాయాన్ని ఆదివారం రాత్రి 10.30 గంటల తర్వాత చినల్ల కుంటలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. ఉదయం సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు ముగిశాక, కాంతారావు భౌతికకాయాన్ని ఇండస్ట్రీ సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఫిలింఛాంబర్ కార్యాలయం ఆవరణకు తరలించారు.

ఫిలింఛాంబర్‌లో ఉంచిన కాంతారావు భౌతికకాయాన్ని దాసరి నారాయణరావు, మోహన్ బాబు, చిరంజీవి, నాగబాబు, మురళీమోహన్, బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తమ్మారెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణ, కైకాల సత్యనారాయణ, గీతాంజలి, నన్నపనేని రాజకుమారి, సుబ్బరామిరెడ్డి, జీవిత తదితరులు సందర్శించారు. 

సినీ ప్రముఖులంతా కాంతారావు భౌతికకాయానికి పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు కాంతారావు భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వద్దకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు కాంతారావు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటులు సత్యనారాయణ మాట్లాడుతూ తమది 50 సంవత్సరాల అనుబంధమని, చాలా చిత్రాలకు కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. కాంతారావు గొప్పనటుడని, ఆయనను ఆంధ్రా ఎంజీఆర్‌ అని పిలుస్తుండే వాళ్లమని చెప్పారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, కాంతారావు మరణ వార్త తననెంతో కలచివేసిందని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 

సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంతారావుతో తనకు 57 ఏళ్ల అనుబంధముందని అన్నారు. జానపద, పౌరాణిక వేషాలు వేయాలంటే, ఎన్టీఆర్ తర్వాత కాంతారావే సమర్థుడని, మంచి ఉచ్ఛారణ, అంకితభావంతో పనిచేసిన నటుడని నారాయణ రెడ్డి కొనియాడారు. అంతా సజావుగా ఉన్న తరుణంలో సినిమా నిర్మాణం చేపట్టి ఆర్థికంగా దెబ్బతిని ఇంటిని కూడా పోగొట్టుకుని, దుర్భరమైన జీవితాన్ని అనుభవించారని నారాయణ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

మోహన్‌బాబు మాట్లాడుతూ తనకిష్టమైన నటుడు కాంతారావు అనిఅన్నారు. తాను అసిస్టెంట్ డైరక్టెర్‌గా ఉన్నప్పుడే కాంతారావును బాగా తెలుసునని, ఫోక్‌లోర్‌ హీరో అంటే ఆయనేనని చెప్పారు. 

దాసరి మాట్లాడుతూ 1964 నటునిగా ఆయనతో కలిసి నటించాననిచెప్పారు. తన దర్శకత్వంలోనే 28 సినిమాల్లో పనిచేశారన్నారు. ఆయన లోటు సినీ ప్రపంచానికి తీరని లోటని దర్శకరత్న అన్నారు.

రామానాయుడు మాట్లాడుతూ రాముడు భీముడు సినిమా తర్వాత కాంతారావుతో "ప్రతిజ్ఞా పాలన" తీశానని అన్నారు. ఈ సినిమా చాలా బాగా ఆడిందని, హీరోగా చాలా చిత్రాల్లో చేసినా, వేరే హీరో నటించే చిత్రంలో చిన్న వేషం దొరికినా వేసేవాడని, కాంతారావును తన కుటుంబంలో ఒకడిగా భావించామని ఆయన పేర్కొన్నారు. 

బాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి కాంతారావు పలు సినిమాల్లో కలిసి నటించారని, ఆయన హానటుడనిఅన్నారు. నాన్నగారు ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగే వారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని బాలయ్య చెప్పారు. ఈ సందర్భంగా కాంతారావు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు.

తమ్మారెడ్డి కృష్ణమూర్తి మాట్లాడుతూ జానపద పౌరాణికాల హీరోనే కాగా, నారదునిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించారని, చివరి రోజుల్లో కాంతారావు ఆర్థికంగా దెబ్బతినడం చాలా బాధేసిందని, ఈ మధ్యనే ఆయన్ను చూసేందుకు వెళ్ళి పలకరించి వచ్చానని అన్నారు. 

ఎన్టీఆర్ సొంత సోదరునిగా కాంతారావును చూసేవారని, తమ పెళ్లికి కూడా ఆయన వచ్చారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. మహానటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఆయన, చివరి దశలో చిన్న చిన్న పాత్రలు వేసి కుటుంబాన్ని పోషించడం ఎన్టీఆర్‌ను కలచివేసిందని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను పలకరించేందుకు వచ్చిన కాంతారావుకు తగిన సాయం చేశారని ఆమె చెప్పారు.

పలు సంఘాలు సంతాపం 
ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి కాంతారావు మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటుగా అధ్యక్షుడు బాబ్జీ, కోశాధికారి అల్లంగోపాలరావు, ప్రధాన కార్యదర్శి మద్దినేని రమేష్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, డైరక్టర్స్ అసోసియేషన్, నిర్మాతల మండలి, తదితర ఫెడరేషన్ సంఘాలు కాంతారావు మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.

0 Comments:

Online Movie Theatre | Movies Online